🟡 అమరావతి : ఉండవల్లి : ది డెస్క్ :
అభివృద్ధి పనులకు నిధులివ్వండి
మంత్రి లోకేష్‌కు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ వినతి
పుట్టాని ప్రశంసించిన లోకేష్
జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కోరారు. గురువారం ఉండవల్లి నివాసంలో లోకేష్‌తో భేటీ అయిన ఎంపీ.. జిల్లాలోని అభివృద్ధి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఏలూరులో బీసీ హాస్టల్ నిర్మాణానికి రూ.2 కోట్లు, జిల్లా గ్రంథాలయానికి రూ.3 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొయ్యలగూడెం ఫైర్‌స్టేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతులు, నూజివీడు IIIT ఆధునికీకరణ, సౌకర్యాల కోసం రూ.12 కోట్లు కేటాయించాలని కోరారు. ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
అభివృద్ధి ప్రగతి పుస్తకం :
ఏలూరు పార్లమెంట్ పరిధిలో గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని మహేష్‌కుమార్ మంత్రి లోకేష్‌కు అందించారు. పనులను పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమని లోకేష్ ప్రశంసించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిస్థితులపైనా ఇరువురూ చర్చించారు.

