🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
చెడు అలవాట్ల బారిన బాలుడికి పోలీసుల అండ
మత్తుకు బానిసైన బాలుడు సేఫ్
సీడబ్ల్యూసీ ఆదేశాలతో.. పునరావాస కేంద్రానికి తరలింపు
బాలుడికి భరోసా కల్పించిన పోలీసులు
వివరాల్లోకి వెళితే :
చెడు అలవాట్లకు బానిసై ఇంటిని విడిచి తిరుగుతున్న 11 ఏళ్ల బాలుడిని ఏలూరు టూ టౌన్ పోలీసులు సకాలంలో గుర్తించి రక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలోని శక్తి టీమ్ సహకారంతో బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపరిచి, శనివారపుపేటలోని బాలల వసతి గృహంలో పునరావాసం కల్పించారు.
టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాలుడు కొంతకాలంగా వైట్నర్/సొల్యూషన్ పీల్చడం, సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లకు లోనవడంతో పాటు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతూ, పాఠశాలకు వెళ్లకుండా తరచూ ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ అప్రమత్తమై చర్యలు చేపట్టగా, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, సీఐ సుబ్బారావు ఆదేశాల మేరకు పోలీసులు, శక్తి టీమ్ సభ్యులు బాలుడిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సీడబ్ల్యూసీ ముందు హాజరుపరిచి బాలల వసతి గృహంలో చేర్పించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు మాట్లాడుతూ :
పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు లేదా 112, 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాలుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోలీసులు చేపట్టిన మానవతా చర్యలను స్థానికులు అభినందించారు.

