🟡 ఏలూరు జిల్లా | ఏలూరు | ది డెస్క్ :
రూ.1.65 కోట్లతో ఓవర్‌హెడ్ ట్యాంకుకు శంకుస్థాపన
ఏలూరులో నీటి, డ్రైనేజీ పనులకు రూ.299 కోట్ల వ్యయం
➖ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అమృత్–2.0 పథకం కింద అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. సోమవారం 27వ డివిజన్ చోదిమెళ్లలో రూ.1.65 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంలోని ఓవర్‌హెడ్ ట్యాంకుకు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మాట్లాడుతూ :
ఏలూరు నగరంలో తాగునీరు, మురుగునీటి నిర్వహణ పనుల కోసం అమృత్–2.0 కింద రూ.299.37 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో రూ.143.13 కోట్లు తాగునీటి పథకాలకే వెచ్చిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు.
ఏటిగట్టు–హనుమాన్‌నగర్ రహదారికి రూ.50 లక్షల ఎంపీ నిధులు, చోదిమెళ్లలో బోరు నిర్మాణానికి మరో రూ.7 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని, త్వరలో కోకో సిటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.

