🟡 నెల్లూరు జిల్లా :పొదలకూరు : ది డెస్క్ :
కోట్లాది రూపాయలతో పురాతన ఆలయాల పునర్నిర్మాణం, నూతన ఆలయాలు నిర్మిస్తున్నాం
ఆధ్యాత్మికతకు చిరునామాగా నెల్లూరు జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
విరువూరులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి సీతారామస్వామి ఆలయ మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి
రాష్ట్రంలోని ఆలయాల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత కలిగి ప్రతి ఆలయం కూడా ఆధ్యాత్మిక శోభతో విరజిల్లేల ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
గురువారం ఉదయం పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో సీతారామస్వామి దేవస్థానం మహా కుంభాభిషేక కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు, దేవాదాయశాఖ అధికారులు, స్థానిక నేతలు వారికి అపూర్వ స్వాగతం పలికారు.
ఆలయ పునర్నిర్మాణం, నూతన విగ్రహ ప్రతిష్ట, ధ్వజప్రతిష్ట శిలాఫలకాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ:
విరువూరులో పురాతన సీతారామస్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించామని తెలిపారు. దేవాదాయశాఖ కామన్‌గుడ్ ఫండ్ నుంచి రూ.40 లక్షలు, దాతలు మరియు ఆలయ కమిటీ సభ్యుల నుంచి రూ.10 లక్షలు సమకూర్చి మొత్తం రూ.50 లక్షలతో పనులు పూర్తి చేశామని చెప్పారు. ఆలయ అంతరాలయం, గర్భగుడి నిర్మాణాలను పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించినట్లు వెల్లడించారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దేవాదాయశాఖ ఇంజనీర్లు, స్థపతులతో కలిసి మిగిలిన నిర్మాణాలపై ప్రణాళికలు సిద్ధం చేసి పెండింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలో దేవాదాయశాఖ చిత్తశుద్ధి, నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. ప్రతి గ్రామంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం, అవసరమైన చోట కొత్త ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ధూపదీప నైవేద్య పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5900కు పైగా ఆలయాలకు ప్రతినెలా రూ.10వేలు చొప్పున పూజారుల ఖాతాలకు జమచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 600కు పైగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం జరుగుతోందని చెప్పారు. అలాగే టిటిడి ఆధ్వర్యంలో రాబోయే రెండేళ్లలో 5వేల కొత్త ఆలయాల నిర్మాణానికి రూ.750 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు ఒకే రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో జరగడం అరుదైన విషయమని, గతంలో జరిగిన పుష్కరాలకు, రాబోయే పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సారధిగా ఉండడం గొప్ప వరమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పేర్కొన్నారు.
విరువూరుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కామన్‌గుడ్ ఫండ్ ద్వారా మరో 7 ఆలయాలకు రూ.6.48 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భజన మందిరాల కోసం సర్వేపల్లి నియోజకవర్గం లోని 10 ప్రాంతాల్లో రూ.1.65 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 93 ఆలయాలకు ప్రతినెలా రూ.10వేలు చొప్పున చెల్లింపులు జరుగుతున్నాయని, సంవత్సరానికి రూ.1.12 కోట్లు విడుదల చేస్తున్నామని వివరించారు.
ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం ప్రాంతంలోని విశ్వేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధికి కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో కోట్లాది రూపాయలతో పురాతన ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నెల్లూరు జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వివరించారు.
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ :
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా విరువూరు సీతారామ ఆలయ మహా కుంభాభిషేకం జరగడం ఆనందంగా ఉందన్నారు. దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆలయాల అభివృద్ధికి విశేష కృషి చేస్తూ ప్రతి గ్రామంలో ఆలయాలను నిర్మిస్తున్నారని తెలిపారు. కామన్‌గుడ్ ఫండ్ ద్వారా పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయాల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. గతం కంటే భిన్నంగా దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధికి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, సర్వేపల్లి నియోజకవర్గం లో అడిగిన వెంటనే ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

