🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని మావుళ్ళమ్మ దేవస్థానం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా దేవస్థాన మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విశేష కార్యక్రమంలో భాగముగా ఆదిశంకరుల చిత్రపటానికి దేవస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో దేవస్థానం వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదిశంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళ స్వల్ప కాలంలోనే సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఉద్ధరించారో, వారు రచించిన స్తోత్రాలు, భాష్యాల ద్వారా అర్ధం అవుతుంది.
భారతీయ తత్వశాస్త్రంలో శంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని, నేటి సమాజానికి దాని ఆవశ్యకత తెలియపరచవలసిన ఆవశ్యకత ను, హైందవ ధర్మ పరిరక్షణకు దేశం నలుమూలల నాలుగు పీఠాలను స్థాపించి, సాంస్కృతిక సమైక్యతకు వారు చేసిన కృషిని ధర్మకర్తలు కొనియాడారు..ఆదిశంకరాచార్యులు చూపిన ధర్మ మార్గం మానవాళికి దిక్సూచి. వారి బోధనలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని చైర్మన్ బొండాడ నాగభూషణం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు రామాయణంశ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, మీర్తిపాటి గుణేశ్వరరావు, పాపొలు ఏడుకొండలు దేవస్థానం అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు

