The Desk… Nandigama : ఏటూరు పంచాయతీ ఏకగ్రీవం

The Desk… Nandigama : ఏటూరు పంచాయతీ ఏకగ్రీవం

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : ది డెస్క్ :

నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే అభినందనలు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

అభివృద్ధికి అంకితమవ్వాలి

మండలంలోని ఏటూరు గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో నూతన సర్పంచ్ చలంచలం కృష్ణ ప్రసాద్, ఉపసర్పంచ్ ఉన్నం తులసమ్మ, వార్డు సభ్యులు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె నూతన పాలకవర్గాన్ని శాలువాలతో సత్కరించి అభినందించారు.
ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సౌమ్య సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.

చందర్లపాడు పంచాయతీ కూటమి ఖాతాలోకి :

ఏకగ్రీవ పాలకవర్గానికి తంగిరాల సౌమ్య అభినందనలు

మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా కూటమి అభ్యర్థుల వశం కావడంతో నూతన సర్పంచ్ మేకల సుధాకర్, 11 మంది వార్డు సభ్యులు గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఆమె కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె నూతన ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శాఖమూరి అపర్ణ, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

జుజ్జూరులో కూటమి ప్రచార జోరు :

ఉంగరం గుర్తుకు ఓటేయండి

మల్లేశ్వరిని గెలిపించండి

జుజ్జూరు గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నెమలిపురి మల్లేశ్వరి తరఫున ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి మల్లేశ్వరిని గెలిపించాలని గ్రామస్థులను కోరారు.

గ్రామాభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. వార్డు సభ్యుల అభ్యర్థులను సైతం గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వసంత హైమావతి మృతి బాధాకరం :

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు సతీమణి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాతృమూర్తి, ఐతవరం మాజీ సర్పంచ్ వసంత హైమావతి మృతి పట్ల నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, హైమావతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.