The Desk … Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో లక్ష కుంకుమార్చన

The Desk … Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో లక్ష కుంకుమార్చన

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ న్యూస్ :

400 మంది దీక్షాపరుల సామూహిక పూజలు

భక్తులకు ప్రసాద వితరణ

కుంకుమార్చనతో మార్మోగిన మావుళ్లమ్మ ఆలయం

భీమవరం పట్టణంలో ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్య దైవం మావుళ్లమ్మ దేవస్థానంలో లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి దీక్షను స్వీకరించిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణలు, సంప్రదాయబద్ధమైన పూజా విధానాల నడుమ లక్ష కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా సాగింది. అమ్మవారికి కుంకుమార్చన సమర్పిస్తూ దీక్షాపరులు భక్తిపారవశ్యంలో పూజల్లో పాల్గొన్నారు. లోకకల్యాణం, సకల జనుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ పూజా కార్యక్రమంలో సుమారు 400 మంది అమ్మవారి దీక్షాపరులు పాల్గొన్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ తెలిపారు.

పూజల్లో పాల్గొన్న దీక్షాపరులందరికీ ఆలయ తరఫున ప్రసాదాలను అందజేసినట్లు వెల్లడించారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల ఆధ్యాత్మిక సందడితో దేవస్థాన ప్రాంగణం భక్తిమయంగా మారింది.

మావుళ్లమ్మను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి

నిత్యాన్నదానానికి రూ.25 వేల విరాళం

మావుళ్లమ్మవారిని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సి. నాగరాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే సందర్భంగా చదలవాడ భరత్ చంద్ర, ప్రత్యూష దంపతులు అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ దంపతులకు పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.