🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ న్యూస్ :
రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం
ఫారూఖ్ షిబ్లీ ఔదార్యం
ముదినేపల్లి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ
వైష్ణవిని ఆశీర్వదించి.. రూ.116 కార్యక్రమానికి విజయవాడలో ఏర్పాట్లు చేస్తామని హామీ
అమరావతి రాజధాని అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తుండటం అభినందనీయమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కృష్ణా జిల్లా ముదినేపల్లిలోని అంబుల వైష్ణవి ఆసుపత్రిని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి కార్యక్రమానికి మద్దతుగా ఏపీసీఆర్డీఏ (APCRDA) కోడ్ ద్వారా రూ.5,116 విరాళాన్ని అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సంకల్పంతో ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.
అంతేకాకుండా, అమరావతి అభివృద్ధికి ప్రజల్లో మరింత భాగస్వామ్య స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో విజయవాడలోని తమ కార్యాలయంలో త్వరలోనే రూ.116 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా చేపడతామని వెల్లడించారు.
అనంతరం అంబుల వైష్ణవిని ప్రత్యేకంగా ఆశీర్వదించి, ఆమె చేపడుతున్న కార్యక్రమాల పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వర్గాలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాయి.

