🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కృష్ణానది జలాలను నందిగామకు తరలించి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రాజెక్టులో భాగంగా 9వ వార్డు ముక్కపాటి నగర్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం భూమిపూజ చేశారు.
గుడిమెట్ల వద్ద కృష్ణానది నుంచి నీటిని తీసుకుని నందిగామ పట్టణానికి సరఫరా చేసే ప్రణాళికలో భాగంగానే ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుపడి, వేసవిలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతని, నందిగామ అభివృద్ధికి ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని సౌమ్య తెలిపారు.

