The Desk … Eluru : స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలే లక్ష్యం

The Desk … Eluru : స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలే లక్ష్యం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు టిడిపి కార్యాలయం : ది డెస్క్ :

జిల్లా టీడీపీ సమావేశంలో గెలుపు వ్యూహాలపై మంతనాలు

ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం 10 రోజుల వాయిదా

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను కూటమి అభ్యర్థులతో కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ గెలుపు వ్యూహాలతో ముందుకు సాగుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. కూటమి శ్రేణుల్లో ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తూ, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

జిల్లా కమిటీ సమావేశం నిర్వహణ :

ఏలూరు అమీనాపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రతినెలా చివరి బుధవారం నిర్వహించే సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తదితర నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చ :

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని గ్రామ, మండల స్థాయిలో అమలు చేయాల్సిన వ్యూహాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడంతో పాటు, కూటమి ఐక్యతను కాపాడుతూ ఎన్నికలను ఎదుర్కొనే అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

ఇంటింటికీ కార్యక్రమానికి వాయిదా :

ఈ నెల 25వ తేదీ నుంచి చేపట్టాలని నిర్ణయించిన ‘ఇంటింటికీ టీడీపీ’ 45 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని, ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే (సర్) ప్రక్రియ నేపథ్యంలో 10 రోజుల పాటు వాయిదా వేయాలని సమావేశం నిర్ణయించింది. సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు బడేటి చంటి తెలిపారు.

రైతులకు పూర్తి అవగాహన అవసరం :

ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త యాప్‌లు, సాంకేతిక విధానాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించిన తరువాతే అమలులోకి తీసుకురావడం మంచిదని అభిప్రాయపడ్డారు.
అధిష్ఠానానికి నివేదిక
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సూచనలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి వెల్లడించారు. స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు కూటమి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.