🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
పేద ప్రజల సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించి, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా చూడాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు.
జిల్లాలో రోడ్లు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణాలు, తాగునీటి పథకాలు, గ్రామీణాభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. భూసేకరణ సమస్యల కారణంగా ఆలస్యమవుతున్న ఆర్వోబీ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీతంపేట ఆర్వోబీ పనులను 15 రోజుల్లో ప్రారంభించాలని సూచించారు.
అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాసిరకం పనులు కొనసాగితే కేంద్ర స్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ, ఈ ఏడాది అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలని గడువు విధించారు.
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐడీపీహెచ్ ల్యాబ్‌ను జంగారెడ్డిగూడెంకు తరలించే ప్రతిపాదనను వ్యతిరేకించిన ఎంపీ, ప్రజలకు ఉపయోగపడుతున్న ల్యాబ్‌ను యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. అలాగే ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పనులు నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, స్మశానవాటికల నిర్మాణం, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల ఏర్పాటు, పర్యాటకాభివృద్ధి వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంపీ కార్యాలయం నుంచి పంపుతున్న వినతులకు అధికారులు స్పందన మెరుగుపరచాలని ఆదేశించారు.
సమావేశంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జెడ్పీ సీఈవో జగదాంబతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

