The Desk … Bhimavaram : గ్రంధి హయాం ప్రణాళికలు… అమలులో ఆలస్యంపై విమర్శలు

The Desk … Bhimavaram : గ్రంధి హయాం ప్రణాళికలు… అమలులో ఆలస్యంపై విమర్శలు

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న యనమదుర్రు డ్రైన్‌పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు లేకపోవడం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కేజీఆర్ కాలేజీ రోడ్, గొల్లవాని తిప్ప, తోక తిప్ప ప్రాంతాల్లో మూడు వంతెనలు నిర్మాణం పూర్తయ్యినా, రోడ్లు లేక ప్రజలకు ఉపయోగం లేకుండా నిలిచిపోయాయి.


ఈ సమస్యను అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సుమారు రూ.38.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆధునిక డిజైన్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే మొదటి టెండర్‌కు ఒకే దరఖాస్తు రావడంతో మళ్లీ టెండర్ పిలిచారు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ ఆగిపోయింది.
తరువాత 2024 ఎన్నికల్లో పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గతంలో మంజూరైన నిధులను ఉపయోగించి పనులు పూర్తి చేయడంలో పురోగతి లేకపోయిందని స్థానికులు అంటున్నారు.

ఇప్పటికే రెండు సంవత్సరాలు గడుస్తుండగా, ప్రస్తుతం మూడు వంతెనల్లో కేవలం రెండు వంతెనలకు మాత్రమే సుమారు రూ.22 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో భీమవరం టౌన్ పరిధి, గొల్లవానితిప్ప ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్లు నిర్మించనున్నారు. అయితే తోకతిప్ప వంతెనకు సంబంధించిన పనులు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే, ఈ పనులకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేయాల్సి ఉండగా, ఆయనకు సర్జరీ జరగడంతో కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి శంకుస్థాపన ఎప్పుడు జరుగుతుందన్నది ఆయన విడుదల చేసే షెడ్యూల్‌పై ఆధారపడి ఉంది. మొత్తానికి, గతంలో మంజూరైన పూర్తి నిధులు వినియోగించబడితే మూడు వంతెనలూ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం పనులు అర్ధాంతరంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.