🔴 కృష్ణాజిల్లా : అవనిగడ్డ : ది డెస్క్ :
రూ.50 లక్షల నిధుల దుర్వినియోగం
నలుగురు అధికారులపై ‘ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్’
జంపాన శ్రీనివాస్‌గౌడ్ ఫిర్యాదుతో కదిలిన అవినీతి వ్యవహారం
అవనిగడ్డ గ్రామ పంచాయతీలో 2012–16 మధ్యకాలంలో సుమారు రూ.50 లక్షల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాజిక కార్యకర్త, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ క్యాంపెయిన్ ప్రతినిధి జంపాన శ్రీనివాస్‌గౌడ్ ఫిర్యాదుతో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు నలుగురు అధికారులపై ‘ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్’ జారీ చేశారు.
లోకాయుక్తను ఆశ్రయించిన జంపాన :
పంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జంపాన శ్రీనివాస్‌గౌడ్ 2020 జనవరి 31న లోకాయుక్తను ఆశ్రయించారు. కేసును 115/2020/లోక్/బి1గా నమోదు చేసిన లోకాయుక్త.. సమర్పించిన ఆధారాలను పరిశీలించి సమగ్ర విచారణకు ఆదేశించింది. అప్పటి కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక, ఫిర్యాదుదారు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం పంచాయతీరాజ్ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి–1991లోని రూల్ 9 ప్రకారం తదుపరి చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు.
నలుగురిపై అభియోగాలు :
విచారణలో భాగంగా మాజీ పంచాయతీ కార్యదర్శి వి.రంగారావు, జూనియర్ అసిస్టెంట్ కె.రామ్ ప్రసాద్, పంచాయతీ సిబ్బంది ఎం.లక్ష్మణరావు, అప్పట్లో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈగా పనిచేసిన ఎల్.వి.వి.ఎస్.శ్రీనివాసరావుపై అభియోగాలు నమోదు చేశారు. వీరిలో రంగారావు ఇప్పటికే నిర్బంధ పదవీ విరమణ పొందగా, రామ్ ప్రసాద్ ప్రస్తుతం పులిగడ్డ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు. లక్ష్మణరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. శ్రీనివాసరావు 2015 మే 13న మృతి చెందారు.
పోరాటం కొనసాగుతుంది :
గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో అవనిగడ్డకు రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానం రావడం బాధాకరమని జంపాన శ్రీనివాస్‌గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా మంచినీటి ట్యాపుల మంజూరు, ధ్రువీకరణ పత్రాల జారీ తదితర అంశాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

