🟡 ఏలూరు జిల్లా : ది డెస్క్ :
బీసీ, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అన్నారు. గురువారం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శుభకార్యాల్లో పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం సొసైటీ గోడౌన్‌ను ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ‘రెండేళ్ల కూటమి ప్రభుత్వం–అభివృద్ధి, సంక్షేమం’ సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మాట్లాడుతూ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని పేర్కొన్నారు.
పొగాకు రైతులతో ఎంపీ :
జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ రైతులతో మాట్లాడారు. పొగాకు ధర ప్రస్తుతం కిలో రూ.293కు చేరిందని, మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణ సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిలోకు రూ.10 అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
నేవీ ఆయుధ డిపో కోసం భూసేకరణపై రైతులందరి అంగీకారంతోనే ముందుకు వెళ్తామని, ఎవరికీ అన్యాయం చేయడం తమ ఉద్దేశం కాదని ఎంపీ స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

