🟡 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : ది డెస్క్ :
అర్హులైన ప్రతి రైతు పంటల బీమాలో నమోదు కావాలి
➖మంత్రి మనోహర్
సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో సాధారణం కంటే 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న 15 మండలాల్లో కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. ఇప్పటికే 66,293 పీఎండీఎస్ కిట్లు పంపిణీ చేసినందున మరో 35 వేల కిట్లు అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతు, కౌలు రైతు పంటల బీమాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గోదావరి, కృష్ణా డెల్టాల్లో తొలుత తాగునీటికి ప్రాధాన్యమిస్తూ, మిగులు జలాలను సాగుకు వినియోగించేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కాల్వల నుంచి అక్రమంగా మోటార్లతో నీటిని మళ్లించకుండా నిఘా పెట్టాలన్నారు.
మంజూరైన ఇళ్లను ఏళ్లుగా వినియోగించుకోని వారి కేటాయింపులు రద్దుచేసి అర్హులకు ఇవ్వాలని, తాత్సారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చాలని, ఏలూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి రోడ్లు, డ్రైన్లపై చెత్త, మురుగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.
22ఏ భూముల సమస్యలపై తక్షణ చర్యలు, వరదలు–విపత్తుల నివారణకు ముందస్తు ప్రణాళిక, పీజీఆర్ఎస్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ :
నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులు స్వీకరించని ఇళ్లను రద్దుచేసి అర్హులకు కేటాయించాలని కోరారు. చిన్నపాటి వర్షానికే ఏలూరు నగరం జలమయం అవుతున్నందున డ్రైన్లలో సిల్ట్ తొలగించి ముంపు సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వాసుపత్రిలో మురుగునీటి సమస్యను నివారించాలని విజ్ఞప్తి చేశారు.

