The Desk … Eluru : బ్యారెన్ కోటా 40 క్వింటాళ్లకు పెంచాలి..పొగాకు బోర్డు సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ డిమాండ్

The Desk … Eluru : బ్యారెన్ కోటా 40 క్వింటాళ్లకు పెంచాలి..పొగాకు బోర్డు సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ డిమాండ్

🟡 ఏలూరు జిల్లా : ఢిల్లీ/ గుంటూరు : ది డెస్క్ :

పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యారెన్‌కు ఉత్పత్తి పరిమితి (కోటా)ని 35 క్వింటాళ్ల నుంచి 40 క్వింటాళ్లకు పెంచాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పొగాకు బోర్డును కోరారు. గురువారం గుంటూరులో నిర్వహించిన పొగాకు బోర్డు సమావేశంలో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఆయన, ఇటీవల తనను కలిసిన రైతులు వ్యక్తం చేసిన సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.

పొగాకు కొనుగోలు ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారెన్‌కు 35 క్వింటాళ్ల ఉత్పత్తి పరిమితి నిర్ణయించడం వల్ల రైతులకు గిట్టుబాటు కావడం లేదని, పెరుగుతున్న సాగు వ్యయాలు, తగ్గుతున్న దిగుబడుల నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 40 క్వింటాళ్ల కోటా అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.

రాష్ట్రంలోని ఎన్‌ఎల్‌ఎస్‌ (NLS) పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని బోర్డు సభ్యులను ఆయన కోరారు. అలాగే మార్కెట్‌లో కనీస ధర కిలోకు రూ.300 స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతుల ఆందోళనను బోర్డు దృష్టికి తీసుకువచ్చారు.

ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్, రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, కొనుగోలుదారులతో చర్చించి రైతులకు అనుకూలంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

రైతుల సమస్యల పరిష్కారానికి ఎంపీ చేసిన జోక్యం పట్ల పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేశారు.