The Desk …Kanchikacharla : అంతరాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించిన కంచికచర్ల పోలీసులు

The Desk …Kanchikacharla : అంతరాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించిన కంచికచర్ల పోలీసులు

🔴 ఎన్టీఆర్ జిల్లా : కంచికచర్ల : ది డెస్క్

10 రోజుల్లోనే కేసు ఛేదన – రూ.52 లక్షల విలువైన బంగారం స్వాధీనం

కంచికచర్ల మండలం నక్కలంపేట గ్రామంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నలుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.52 లక్షల విలువైన 374 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 4వ తేదీన గుత్తా పద్మజ నివాసంలో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి 374 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను విశ్లేషిస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడ్డ నిందితులు :

నందిగామ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నక్కలంపేట చోరీ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలింది. అనంతరం వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అరెస్ట్ అయిన నిందితులు :
మాదగాని సురేష్ (36)
కూతాటి జంపయ్య (35)
దాసరి సందీప్ (19)
కూజా ఉపేంద్ర (33)

వీరు మహబూబాబాద్ జిల్లాకు చెందినవారని పోలీసులు వెల్లడించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచన :

ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ :

లక్షల రూపాయలు వెచ్చించి గృహాలు నిర్మిస్తున్నప్పటికీ చాలా మంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదని అన్నారు. దీనివల్ల చోరీలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం కష్టమవుతోందని పేర్కొన్నారు.
ప్రతి ఇంటి యజమాని తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామాల్లో ప్రతి వీధిలోనూ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సచివాలయాలతో అనుసంధానం చేయాలని సూచించారు.

కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు :

కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు, కంచికచర్ల ఎస్ఐలు విశ్వనాథ్, నాని నరేంద్ర, వీరులపాడు ఎస్ఐ అభిమన్యు, చందర్లపాడు ఎస్ఐ ధర్మరాజు మరియు సిబ్బందిని ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.