🔴 విజయవాడ / ఉయ్యూరు : ది డెస్క్ న్యూస్ :

కృష్ణా జిల్లా కలెక్టర్ తీరుపైనా అసహనం..!!
జనవరి 27లోగా చర్యలు తీసుకోవాలని అల్టిమేటం
కృష్ణా జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) కె.రాజేంద్రబాబుపై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఏమిటీ వ్యవహారం..?
కృష్ణా జిల్లా బీసీ కార్పొరేషన్ మాజీ ఈడీ, మాజీ రెవెన్యూ అధికారి కుమారి ఆలపాటి ప్రభావతి 2009లో నిబంధనలకు విరుద్ధంగా 82 రోజుల లీవ్ శాలరీని అదనంగా డ్రా చేసిన రూ.62,642లలో ఇంకా రూ.18,077లను బీసీ కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంది. దీనిపై సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు 2024 డిసెంబరు 13న ఉపలోకాయుక్త జస్టిస్ పి.రజని సదరు మొత్తాన్ని వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు పంపినప్పటికీ, మాజీ డీఆర్వో తీసుకోకుండా వెనక్కి పంపుతున్నట్లు పేర్కొన్నారు.
ఉత్తర్వులు ఉన్నా అమలు శూన్యం :
ఈ వ్యవహారంపై 2025 డిసెంబరు 15న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జి.సాయి ప్రసాద్, 2026 ఫిబ్రవరి 3న సీసీఎల్ఏ జి.జయలక్ష్మి కృష్ణా జిల్లా కలెక్టర్‌ను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా చర్యలు అమలు కాకపోవడంతో జంపాన శ్రీనివాస గౌడ్ 2026 జూన్ 17న లోకాయుక్తకు మరోసారి ఫిర్యాదు చేశారు.
కలెక్టర్‌పైనా అసహనం :
2024లో ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలు చేయకపోవడంపై లోకాయుక్త జస్టిస్ తల్లాప్రగడ కృష్ణా జిల్లా కలెక్టర్‌పై కూడా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వచ్చే విచారణ తేదీ జనవరి 27 నాటికి రూ.18,077 వసూలు చేయడమో లేక ప్రభావతికి వస్తున్న పింఛన్ నిలుపుదల చేయడమో జరగాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై విచారణకు ఆదేశిస్తామని, బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. కాగా, ప్రభావతి ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి ఆలపాటి ధర్మారావు కుమార్తె అని లేఖలో పేర్కొన్నారు.

