🔴 పగో: తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛతా డ్రైవ్‌కు ముగింపు
చెన్నై షాపింగ్ మాల్ వద్ద అధికారుల ప్రతిజ్ఞ
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు వారాలుగా కొనసాగిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. మే 23 నుంచి జూన్ 19 వరకు నిర్వహించిన ఈ డ్రైవ్ ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని చెన్నై షాపింగ్ మాల్ ప్రాంతంలో పురపాలక కమిషనర్ ఎం. యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రజల సహకారంతో స్వచ్ఛత లక్ష్యం సాధన :
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
పట్టణంలోని అన్ని వార్డుల్లో చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. రహదారులు, డ్రైన్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృత స్థాయిలో శుభ్రత పనులు చేపట్టి పట్టణ పరిశుభ్రతను మెరుగుపరిచినట్లు తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి :
పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన తాడేపల్లిగూడెం నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. చెత్తను నిర్దేశిత డస్ట్‌బిన్లలో వేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పట్టణ స్వచ్ఛతను కాపాడుకోవచ్చన్నారు.
“స్వచ్ఛ తాడేపల్లిగూడెం” కోసం ప్రతిజ్ఞ :
ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరూ “స్వచ్ఛ తాడేపల్లిగూడెం” లక్ష్య సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.

