🟡 నెల్లూరు : ది డెస్క్ :
- ప్రభుత్వ అనుమతి లభించగానే మే 4 నుంచి నీటి విడుదలకు నిర్ణయం
- ప్రతి నీటి బొట్టు ను అత్యంత జాగ్రత్తగా వాడుకోవాలి
- రైతాంగానికి నీటిని విడుదల చేయడంలో సాగునీటి సంఘాలకే సర్వాధికారాలు
- సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణతో తొలి పంటకు పుష్కలంగా సాగునీరు అందించాం
- రైతాంగం అవసరాల మేరకు రెండో పంటకు కూడా సాగునీరు అందిస్తాం
- జిల్లాలో జలధార ద్వారా ముమ్మురంగా సాగునీటి కాలువల పనులు
- సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించి నీటిని భద్రపరుచుకుందాం
- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సంబంధించి 4,47,322 ఎకరాల ఆయకట్టుకు 49.760 టీఎంసీల నీటిని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి విడుదల చేసేందుకు సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సాగునీటి సలహా మండలి (IAB) సమావేశంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేష్, సాగునీటి సంఘాల అధ్యక్షులు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ లు, రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో సాగునీటి, తాగునీటి అవసరాలు, సాగునీటి పంపిణీ, రైతులకు గిట్టుబాటు ధరలు, పెండింగ్‌లో ఉన్న కాలువలు, ప్రాజెక్టులపై అవసరమైన మేర నీటి విడుదలపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ :
రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టిసారించి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. గూడూరు రూరల్ మండల పరిధిలోని కాండ్ర, పారిచర్ల, వెండోడు వంటి గ్రామాల చెరువులకు నీరు అందించాలని కోరారు. స్వర్ణముఖి బ్యారేజ్‌కు 2 టీఎంసీల నీరు అందిస్తే 10 వేల ఎకరాలకు లాభం చేకూరుతుందని తెలిపారు. యల్లసిరి కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తే చిట్టమూరు మండలానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దుగ్గరాజుపట్నం కాలువ పనులకు అనుమతులు ఇవ్వాలని, వేసవి దృష్ట్యా గూడూరు నియోజకవర్గానికి నీరు అందించాలని కోరారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ :
గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం డ్యాంలలో నీరు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. లస్కర్ల జీతాల సమస్యను రైతులు, నీటి సంఘాల సహకారంతో పరిష్కరించాలని అన్నారు. అధిక వేసవి తాపం వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ప్రభావం దృష్ట్యా నీటి వినియోగంపై జాగ్రత్త అవసరమన్నారు. బండేపల్లి వంటి కాలువ పనులు పూర్తి చేయాలని, కృష్ణపట్నం, సర్వేపల్లి కాలువలపై ఆక్రమణలను తొలగించాలని కోరారు. చెన్నై, తిరుమల, రైతులకు నీరు అవసరం ఉన్నందున సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ :
స్వర్ణముఖికి 2 టీఎంసీల నీరు అవసరమని అసెంబ్లీలో కూడా ప్రస్తావించానన్నారు. జీఓ 365 రద్దుతో నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పెండింగ్ కాలువ పనులు పూర్తి చేస్తే తడ, సూళ్లూరుపేట ప్రాంతాలకు మేలు జరుగుతుందని చెప్పారు. తమ కోరిక మేరకు స్వర్ణముఖికి 2 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ :
తన నియోజకవర్గంలోని 8 మండలాల్లో త్రాగు, సాగునీటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఇటీవల వింజమూరుకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకత సోమశిల నీటితో పాతూరు చెరువు అభివృద్ధి చేసి 35 వేల మందికి తాగునీరు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గంలో సోమశిల నీటితో నిండే చెరువు వింజమూరు కావడం తమ ఘనతగా చెప్పారు. రూ.8 కోట్లతో కాలువల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గండిపేట రిజర్వాయర్ నిర్వహణలో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉదయగిరికి 10 టీఎంసీల నీరు కేటాయించాలని కోరారు.
ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ :
వెంకటగిరి నియోజకవర్గంలో ఆల్తూరుపాడు ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. గతంలో రూ.310.39 కోట్లు మంజూరు అయినప్పటికీ పనులు జరగలేదని అన్నారు. ప్రస్తుతం రూ.610 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నారని, ఇది పూర్తయితే 90,464 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. సూళ్లూరుపేటకు ప్రాణాధారమైన స్వర్ణముఖికి 2.5 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ :
ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మలపూడి గ్రామంలో చిన్న, సన్నకారు రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ :
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వ్యవస్థను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించి, నిలిచిపోయిన పనులను మళ్లీ ప్రారంభించిందన్నారు. గత ఐదేళ్లలో ఐఏబీ సమావేశాల్లో సమస్యలపై సరైన చర్చలు జరగలేదని విమర్శించారు.
గత ఏడాది సోమశిల కింద మొదటి పంట సుమారు 7 లక్షల ఎకరాల్లో పండగా, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిందన్నారు. తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా గత ఏడాది 273 టీఎంసీల నీరు వచ్చినప్పటికీ, పెన్నా నదిలో వరదలతో 133 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందని తెలిపారు.
ప్రస్తుతం సోమశిలలో 58.17 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, అందులో 45 టీఎంసీల వినియోగాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
నెల్లూరు జిల్లాలో 35.89 టీఎంసీల నీటితో 3,23,322 ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిపాదన సిద్ధం చేశామని, అదనంగా 5 టీఎంసీల నీటిని చెన్నైకు ఇవ్వాల్సి ఉందని వివరించారు.
కండలేరు ప్రాజెక్టులో 18 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, 1,24,000 ఎకరాలకు 13.78 టీఎంసీల నీటిని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. సోమశిల, కండలేరు రెండు జలాశయాల నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లాలకు మొత్తం 4,47,322 ఎకరాలకు 49.760 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రజా ప్రతినిధులు, సాగునీటి సంఘాలు, రైతుల సూచనల మేరకు తీర్మానించినట్లు మంత్రి వెల్లడించారు. అవసరమైన అనుమతులు తీసుకుని మే 4న నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 4557 సాగునీటి పనులను రూ.393 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. అలాగే రూ.34 కోట్ల నీటి తీరువాయి వసూలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
నీటిని వృథా చేయకుండా సమర్థవంతంగా వినియోగించాలని రైతులకు సూచించారు. సోమశిల డ్యాం పరిధిలోని మెట్టప్రాంతాల్లో ఎప్పటికీ నీటి కొరత ఉండటం దురదృష్టకరమని, అక్కడి పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమశిల హై లెవల్ కాలువకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు నిర్ణయాలతో అన్యాయం జరిగిందని, మొదటి దశ పూర్తి కాకముందే రెండో దశకు శంకుస్థాపనలు చేసినట్లు విమర్శించారు. జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జలధార పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ దేశ్ నాయక్, సోమశిల ఎస్ ఇ వెంకటరమణారెడ్డి, తెలుగంగ ఎస్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర రావు, తిరుపతి ఎస్ ఈ రాధాకృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, మత్స్యశాఖ జెడి శాంతి, జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

