The Desk … Nandigama : విద్యుత్‌ సేవా సేతు.. ఇంటింటా సౌర విద్యుత్‌తో బిల్లులకు ఉపశమనం

The Desk … Nandigama : విద్యుత్‌ సేవా సేతు.. ఇంటింటా సౌర విద్యుత్‌తో బిల్లులకు ఉపశమనం

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

ఇంటి పైకప్పులపై సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. నందిగామ గాంధీ సెంటర్‌లో విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యుత్‌ సేవా సేతు’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్‌–ముఫ్త్‌ బిజ్లీ యోజన కింద అందుతున్న సబ్సిడీ, నెట్‌ మీటరింగ్‌, రుణ సదుపాయాలు, సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏపీసీపీడీసీఎల్‌ పరిధిలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో సేవా సేతు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

గ్రామీణ ఆరోగ్య కేంద్రం – పల్లెకు చేరువలో వైద్యం :

రూ.36 లక్షలతో నరసింహారావుపాలెంలో ఆరోగ్య కేంద్రం ప్రారంభం :

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. స్థానికంగానే ప్రాథమిక వైద్యం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ సమయం, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. పల్లె నుంచి పట్టణం వరకు వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని సౌమ్య తెలిపారు.