The Desk … Eluru : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ➖ ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ➖ ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు.

ఏడు సంవత్సరాలుగా వేతనాలు పెరగకపోవడంతో పెరిగిన ధరల నేపథ్యంలో ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ తెలిపారు. అన్ని రకాల సెలవులు, దహన సంస్కార ఖర్చులు, పెరిగిన జనాభాకు అనుగుణంగా పోస్టులు, నాణ్యమైన మొబైళ్లు, యూనిఫామ్‌తో పాటు చట్టప్రకారం గ్రాట్యూటీ కల్పించాలని కోరారు. యూనియన్ నాయకులు ఎం.లోకేశ్వరి, నవ్యరాణి, దేవి తదితరులు పాల్గొన్నారు.ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హామీ ఇచ్చారు.

వర్షాల కోసం వరుణ యాగం :

వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు దండిగా పండాలని ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుణ యాగాలు, వరుణ జపాలు నిర్వహిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.

ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగంలో ఆయన పాల్గొని మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు కిళాంబి మారుతీ శ్రీనివాస రామానుజాచార్యులు, వేదపండితులు యనమండ్ర వెంకట రవిప్రకాష్‌శర్మ ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చంటి తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే దుష్టశక్తుల ఆట కట్టాలని కూడా స్వామివారిని కోరినట్లు చెప్పారు.

వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి తాగునీటి పనులు పూర్తి

ఏలూరు నగరంలో విలీనమైన ఏడు గ్రామ పంచాయతీలకు శుద్ధి చేసిన గోదావరి జలాలను అందించేందుకు చేపట్టిన పనులను వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిచేస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. అమృత్‌ 2.0లో భాగంగా 33 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ పనులు చేపట్టగా, ఇప్పటికే 11 కిలోమీటర్లు పూర్తయ్యాయన్నారు. మంగళవారం వంగాయగూడెం వద్ద జరుగుతున్న క్లియర్‌ వాటర్‌ పంపింగ్‌ మెయిన్‌ పైప్‌లైన్‌ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. చొదిమెళ్లలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌తో పాటు నాలుగు ప్రాంతాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రజా పోరాటమే రంభా వెంకటప్పయ్య వారసత్వం :

ప్రజా సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ రంభా వెంకటప్పయ్య జీవితం ఆదర్శప్రాయమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. గూడ్స్‌షెడ్‌ రోడ్డులోని మెడికల్‌ కాలేజ్‌ కార్నర్‌లో ఏర్పాటు చేసిన వెంకటప్పయ్య విగ్రహాన్ని మంగళవారం చంటి, జనసేన ఏలూరు ఇన్‌చార్జి, ఆర్టీసీ జోన్‌-2 ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు ఆవిష్కరించారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన వెంకటప్పయ్య ఆశయాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

న్యాయ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం :

బాధితుల న్యాయ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా న్యాయ సలహా కేంద్రం నిర్వహిస్తున్నామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన అధ్యక్షతన న్యాయ సలహా కేంద్రం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను న్యాయవాదులకు వివరించగా, కేసుల పూర్వాపరాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించి తగిన న్యాయ సలహాలు అందించారు. అవసరమైన వారు కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని చంటి సూచించారు.