🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

హెచ్‌ఏఎం నిధులతో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడిలో పనులు
ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలో రూ.122 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) శంకుస్థాపన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఏలూరుకు రూ.50 కోట్లు, జంగారెడ్డిగూడెంకు రూ.19 కోట్లు, నూజివీడుకు రూ.35 కోట్లు, చింతలపూడికి రూ.18 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.
ఈ నిధులతో పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పలు పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏలూరు నగరానికి రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం శుభపరిణామమని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.

