🔴 ఏలూరు జిల్లా :ఏలూరు (కార్పొరేషన్ ): ది డెస్క్ :
శరాఫ్, అటెండర్లపై వేటు
అకౌంట్స్ సెక్షన్, మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ
సిడిఎంఏ ద్వారా ప్రత్యేకాధికారులతో విచారణ
క్రిమినల్ కేసులు, రికవరీ చర్యలు తప్పవు
➖మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిధుల జమలో అక్రమాలకు పాల్పడిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కలెక్షన్లను సక్రమంగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయకుండా అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో శరాఫ్తో పాటు అదే విభాగానికి చెందిన అటెండర్‌ను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు (సస్పెండ్/తప్పించినట్లు) కమిషనర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా నగర కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ :
రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన వసూళ్లను రోజువారీగా బ్యాంక్ ఖాతాలో జమ చేసి, వాటి రశీదులను అకౌంట్స్ విభాగానికి అప్పగించాల్సి ఉంటుందన్నారు. అనంతరం మేనేజర్ ఫైనల్ వెరిఫికేషన్ పూర్తి చేసి ERP పోర్టల్‌లో అప్లోడ్ చేయడం నిబంధన అని వివరించారు. అయితే, గత రెండు మూడు నెలలుగా శరాఫ్ సెక్షన్ నుంచి సరైన రశీదులు అందకపోవడంపై అకౌంట్స్ విభాగానికి అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
సమయానుకూలంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ అకౌంట్స్ విభాగ సిబ్బందితో పాటు మేనేజర్‌కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు తెలిపారు.
ప్రత్యేక ఆడిట్‌కు ఆదేశం:
కార్పొరేషన్ అకౌంట్స్ సెక్షన్ నివేదికపైనే పూర్తిగా ఆధారపడకుండా పారదర్శకత కోసం సిడిఎంఏ (CDMA) ఆదేశాల మేరకు ఇద్దరు క్వాలిఫైడ్ అకౌంటెంట్లను రప్పించి సమగ్ర విచారణ, ఆడిట్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. విచారణలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులైన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సదరు సొమ్మును రికవరీ చేసి కార్పొరేషన్ సాధారణ నిధులకు జమ చేస్తామని ఆయన హెచ్చరించారు.

