🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
ధర పతనంతో రైతుల ఆందోళన
సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్తానన్న ఎంపీ
పొగాకు ధరలు భారీగా పడిపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. చింతలపూడి, పోలవరం సహా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పొగాకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు బుధవారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.
కేజీ రూ.200కే పరిమితమైన ధర యార్డుల్లో పొగాకు కొనుగోలు :
ధర కేజీకి రూ.200 స్థాయికి పడిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రూ.300 ధర లభించకపోతే పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు.
అనధికార సాగుపై చర్యలు తీసుకోవాలి :
పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు పరిమి రాంబాబు మాట్లాడుతూ, గతేడాది ఎంపీ చొరవతో అదనపు సెస్ తొలగింపుతో రైతులకు మేలు జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా రైతులను ఆదుకోవాలని కోరారు. అనధికారికంగా పొగాకు సాగు చేస్తున్న వారికి ప్రోత్సాహం ఇస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బోర్డు అనుమతులతో సాగు చేసిన రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
బ్యారెన్‌కు 40 క్వింటాళ్ల కోటా ఇవ్వాలి :
ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు రైతుల ప్రయోజనాలు కాపాడాలని, బ్యారెన్‌కు 40 క్వింటాళ్ల కొనుగోలు కోటా కల్పించేలా పొగాకు బోర్డును ఒప్పించాలని రైతు ప్రతినిధులు ఎంపీని కోరారు.
బోర్డు సమావేశంలో రైతుల సమస్యల ప్రస్తావన :
రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, గురువారం జరిగే పొగాకు బోర్డు సమావేశంలో ఏలూరు జిల్లా రైతుల సమస్యలను బలంగా ప్రస్తావించి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

