🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ న్యూస్ :
మావుళ్లమ్మే ఆరాధ్యం – దీక్షే మార్గం
11 రోజుల పాటు నియమనిష్ఠలతో భక్తుల దీక్షలు
200 మందికి మాలల సమర్పణ
భీమవరం పట్టణ ప్రజల ఆరాధ్యదైవం, ప్రముఖ ఇలవేల్పు మావుళ్లమ్మవారి సన్నిధిలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. అమ్మవారి పాదమండలి దీక్షా మాలధారణ కార్యక్రమం బుధవారం ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తులకు అమ్మవారి దీక్షా మాలలను సమర్పించారు. అమ్మవారిని స్మరిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో మాలధారణ చేసి దీక్షను స్వీకరించారు.
ఈ దీక్షలో భాగంగా మొత్తం 200 మంది భక్తులు అమ్మవారి మాలలు ధరించగా, 11 రోజుల పాటు నియమనిష్ఠలు, భక్తిభావంతో దీక్షను కొనసాగించనున్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలనే సంకల్పంతో భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. హరిసూర్య ప్రకాష్ వెల్లడించారు. మాలధారణ కార్యక్రమంతో మావుళ్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

