🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు
భక్తులకు చీర, రవిక, లడ్డూ ప్రసాదం పంపిణీ
భీమవరం పట్టణ ప్రజల ఇలవేల్పు, ఆరాధ్యదైవమైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రత కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో చీర, రవికతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి :
శ్రీ వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం, శుభసంపదలు కలగాలని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆకాంక్షించారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో భక్తుల కుటుంబాలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
సామూహిక ప్రార్థన మహాదీపం వంటిది :
ఒక్కొక్కరి ప్రార్థన ఒక దీపం అయితే.. వేలాది మంది భక్తులు కలిసి చేసే
సామూహిక ప్రార్థన మహాదీపంలా వెలిగి సమాజానికి శుభాన్ని ప్రసాదిస్తుందని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు పేర్కొన్నారు. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు.
దాతల సహకారం :
ఈ విశేష వరలక్ష్మీ వ్రత కార్యక్రమానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరించారు. శ్రీ అమ్మవారు పుట్టింటి వ్యవహారంలో భాగంగా మెంటే వారి కుటుంబీకులు చీర, రవికలను బహుకరించారు. భీమవరం పట్టణ ప్రముఖులు, పలువురు దాతలు బియ్యం, కొబ్బరికాయలు, అరటిపండ్లు తదితర పూజా సామగ్రిని సమకూర్చారు. దాతల సహకారంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు.
సహకరించిన వారికి అభినందనలు :
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దేవస్థానం ధర్మకర్తల మండలి, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది, భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులకు అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
పాల్గొన్నవారు :
కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

