🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
మున్సిపల్ కార్యాలయంలో PGRS
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యo
తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కమిషనర్ కు నేరుగా వినతిపత్రాలు (అర్జీలు) అందజేశారు. డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఆస్తి పన్ను, పారిశుధ్యం తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు.
ప్రతి అర్జీదారుతో మాట్లాడి సమస్యను తెలుసుకున్న కమిషనర్.. వెంటనే సంబంధిత శాఖాధిపతులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించి, బాధితులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రథమ కర్తవ్యమని, PGRS ద్వారా ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాధిపతులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

8,14, 24 వ వార్డులలోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ :
తాడేపల్లిగూడెం పట్టణంలోని 8వ ,14 వ,24 వ వార్డులలోని ఉన్న ప్రభుత్వ వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ హాస్టల్‌ను మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ హాస్టల్ ఆవరణ, వంటశాల, విద్యార్థుల వసతి గదులు, మరుగుదొడ్లు మరియు త్రాగునీటి సౌకర్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత పాటిస్తున్న తీరుపై హాస్టల్ వార్డెన్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలని, త్రాగునీటి శుద్ధతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటు రాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
ఈ తనిఖీలో మున్సిపల్ అధికారులు, హాస్టల్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

