🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : నారాయణపురం : ది డెస్క్ :

స్వచ్ఛత హీ సేవా మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా.. నారాయణపురం గ్రామ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే అపరిశుభ్ర ప్రాంతాలను గుర్తించి శుభ్రపరిచే కార్యక్రమాన్ని సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ :
పరిశుభ్రత అనేది కేవలం పంచాయతీ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వామి కావాలని సూచించారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచడం, దోమలు మరియు ఇతర వ్యాధికారక కీటకాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
“మన ఇల్లు – మన వీధి – మన వార్డు – మన నారాయణపురం” అనే భావనతో ప్రతి ఒక్కరూ పారిశుధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.
ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు సుందరమైన నారాయణపురం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ వార్డులలో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు గ్రామపంచాయతీ తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నారాయణపురం పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, వార్డు సచివాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

