🔴 కృష్ణాజిల్లా : పమిడిముక్కల : ది డెస్క్ :


9 సం,లుగా రైతు సంక్షేమ పథకాలకు దూరం
75 ఏళ్ల వృద్ధ రైతుకు వైఎస్సార్ రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సాయం అందలేదని ఫిర్యాదు
వ్యవసాయశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జంపాన శ్రీనివాస గౌడ్ ఫిర్యాదు
అర్హత ఉన్నప్పటికీ రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని 75 ఏళ్ల వృద్ధ రైతు గోలి చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పమిడిముక్కల గ్రామానికి చెందిన ఆయనకు కపిలేశ్వరపురం గ్రామ పరిధిలో ఖాతా నంబర్ 4317, సర్వే నంబర్లు 733-2, 734-1, 733-1లో వ్యవసాయ భూమి ఉన్నట్లు సామాజిక కార్యకర్త, ఆర్టీఐ ఉద్యమకారుడు జంపాన శ్రీనివాస గౌడ్ పేర్కొన్నారు.

గత తొమ్మిది సం,లుగా వైఎస్సార్ రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆయన తెలిపారు. వృద్ధ రైతుకు అర్హత ఉన్నప్పటికీ పథకాల ప్రయోజనాలు ఎందుకు అందలేదనే అంశంపై వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అర్హత ఉంటే ప్రయోజనం అందాల్సిందే :
రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేరేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జంపాన శ్రీనివాస గౌడ్ కోరారు. రైతు వివరాలు, భూమి రికార్డులు, బ్యాంకు ఖాతా, పథకాల అర్హతలను సంబంధిత అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ :
75 ఏళ్ల వృద్ధ రైతుకు తొమ్మిది నెలలుగా సంక్షేమ పథకాల ప్రయోజనం అందకపోవడంపై పమిడిముక్కల మండల వ్యవసాయశాఖ అధికారుల పనితీరుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందకపోవడానికి కారణాలను గుర్తించి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అర్హత కలిగిన రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ తదితర పథకాల కింద ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 33, వ్యవసాయ–సహకార శాఖ (అగ్రి.II) విభాగం నిబంధనలను అధికారులు అమలు చేయాలని RTI ప్రతినిధులు బేతపూడి జోగేశ్వరరావు, జంపాన శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

