🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ న్యూస్ :
నాలుగు మండలాల ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
అంబారుపేట సర్పంచ్ అభ్యర్థి విమలకు కూటమి మద్దతు
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని అభివృద్ధి, సంక్షేమంతో నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నూతన ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. గురువారం చందర్లపాడు, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో నిర్వహించిన మండల ప్రజాపరిషత్ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఆమె పాల్గొని అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఐక్యతే విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు.
అనంతరం నందిగామ మండలం అంబారుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన చుండు శ్రీనివాస్ సతీమణి చుండు విమలకు మద్దతు ప్రకటించారు. గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పదవులు అధికారం కోసం కాదు.. ప్రజాసేవకు అవకాశాలని, ప్రజల ఆశయాలే పాలనకు దిక్సూచిగా ఉండాలని ఎమ్మెల్యే సౌమ్య పేర్కొన్నారు.

