🔴 కాకినాడ జిల్లా : అన్నవరం : ది డెస్క్ న్యూస్ :
కత్తిపూడి చోరీ కేసును ఛేదించిన అన్నవరం పోలీసులు
14.5 కాసుల బంగారం – 1/2 kg వెండి -ఐఫోన్ స్వాధీనం.
నలుగురు నిందితుల అరెస్ట్
సాంకేతిక ఆధారాలతో గుట్టురట్టు
తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన ప్రత్యేక బృందం
కత్తిపూడిలో జరిగిన భారీ చోరీ కేసును అన్నవరం పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఇంటి యజమాని ఊరికి వెళ్లిన సమయంలో తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఐఫోన్ అపహరించిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి చోరీకి గురైన 116 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు, కొత్త ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన పాలద్రి వీరదుర్గా శేఖర్ ఈ నెల 25వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి సుమారు 116 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు, నగదు, కొత్త ఐఫోన్‌ను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అక్టోబరు 26న రాత్రి 9 గంటలకు అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
సీసీ కెమెరాలు.. కాల్‌డేటాతో చిక్కిన నిందితులు :
కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాలతో..
పెద్దాపురం డి.ఎస్.పి తిలక్ పర్యవేక్షణలో..
ప్రత్తిపాడు సిఐ సూర్య అప్పారావు నేతృత్వంలో..
కేసును సవాలుగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల దృశ్యాలు, కాల్‌డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. ఈ క్రమంలో కత్తిపూడికి చెందిన వెలుగుల ప్రసాద్, పాలద్రి శ్రీనివాసరాజు, జ్యోతుల వీరబాబు, నెల్లిపూడికి చెందిన దొండ దుర్గారావు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
పోలవరం కాలువ గట్టు వద్ద అరెస్ట్ :
నిందితులు నలుగురినీ గురువారం (నవంబరు 19) సాయంత్రం కత్తిపూడి గ్రామ శివారులోని పోలవరం కాలువ గట్టు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ఐఫోన్‌ను పూర్తిగా రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టయిన నిందితులు :
- వెలుగుల ప్రసాద్ (29) – కత్తిపూడి.
2)పాలద్రి శ్రీనివాసరాజు అలియాస్ శ్రీనివాసు (24) – కత్తిపూడి.
3)దొండ దుర్గారావు (29) – నెల్లిపూడి.
4)జ్యోతుల వీరబాబు (21) – కత్తిపూడి.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు :
ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేని ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక దర్యాప్తుతో “అతి తక్కువ సమయంలోనే ఛేదించిన ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు,” అన్నవరం ఎస్ఐ జి.శ్రీహరిబాబు, అదనపు ఎస్ఐ ఎల్.ప్రసాద్, క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఐపీఎస్, పెద్దాపురం ఎస్డీపీవో ఏబీజీ తిలక్ ప్రత్యేకంగా అభినందించారు.

