🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గo : ది డెస్క్ :
గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
గాంధీజీ ఆశయాలు, ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ నందిగామ నియోజకవర్గంలో శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం @కాకాని నగర్ :
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, సేవా మార్గాలను ఆచరించడమే గాంధీజీకి నిజమైన నివాళి అన్నారు.
59 కుటుంబాలకు రూ.29.63 లక్షల సాయం @చందర్లపాడు :
చందర్లపాడు మండలానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.29,63,012 విలువైన చెక్కులను సౌమ్య పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసాగా నిలుస్తోందన్నారు.
వైద్య సేవలకు బలోపేతం @ 100 పడకల ఆస్పత్రి :
నందిగామ డీవీఆర్ ఏరియా ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. స్లాబ్ పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే నందిగామతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు.
రూ.40 లక్షల సీసీ రోడ్లకు శ్రీకారం @ తక్కెళ్లపాడు, లచ్చపాలెం :
పల్లె పండుగ 3.0లో భాగంగా తక్కెళ్లపాడు, లచ్చపాలెంలో రూ.20 లక్షల చొప్పున చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు సౌమ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, పనులు నాణ్యతతో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
తక్కెళ్లపాడులో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ‘సేవా మేరా యోగ్దాన్’లో భాగంగా మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

