ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
విజయవాడ నుంచి నర్సాపూర్ వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ అనే ప్రయాణికుడు తన బ్యాగ్‌ను పోగొట్టుకున్న ఘటనలో కైకలూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా స్పందించి బ్యాగ్‌ను గుర్తించి తిరిగి అప్పగించారు.
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో, భీమవరం చేరుకున్న తర్వాత తన బ్యాగ్ కనిపించకపోవడంతో హరికృష్ణ కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్‌ను సంప్రదించారు. దీంతో సీఐ రవికుమార్ అత్యాధునిక సాంకేతిక సహాయంతో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
పోగొట్టుకున్న బ్యాగ్‌తో పాటు అందులో ఉన్న విలువైన పత్రాలు, సెల్‌ఫోన్‌ను గుర్తించి తిరిగి ప్రయాణికుడికి అందజేశారు. తన సామగ్రిని సురక్షితంగా తిరిగి అందజేసినందుకు సీఐ రవికుమార్‌తో పాటు కానిస్టేబుల్ ఆంజనేయులు, హోంగార్డ్ ధర్మరాజుకు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

