🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
రూ.50 వేల వడ్డీలేని రుణానికి ఆమోదం
పొగాకు రైతులకు కేంద్రం ఊరట
అదనపు పొగాకు అమ్మకాలకు అనుమతి
రూ.220 కోట్ల వరకు రైతులకు ఉపశమనం
పొగాకు రైతులు అదనంగా పండించిన పంటను ఎలాంటి పెనాల్టీ లేకుండా వేలం కేంద్రాల్లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ తెలిపారు. పొగాకు బోర్డులో నమోదైన డీలర్లు, వ్యాపారులు సాధారణ సర్వీస్ ఛార్జీలతో అదనపు పంటను కొనుగోలు చేసేందుకు అనుమతి లభించిందన్నారు.
బార్న్‌కు రూ.50 వేల చొప్పున వడ్డీలేని రుణానికి ఆమోదం లభించడంతో సుమారు 44 వేల మంది రైతులకు రూ.220 కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. అదనపు పొగాకు విక్రయాలకు అనుమతి కోసం కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అధికారులను తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరినట్లు తెలిపారు. రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, పొగాకు బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం కింద లోగ్రేడ్, ఆఫ్‌గ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున సాయం చేసేందుకు రూ.94 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం పొగాకు ధర కిలో రూ.345 వరకు చేరిందని, రానున్న రోజుల్లో మరింత మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

