🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
రైతులకు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ భరోసా
కొల్లేరు భూముల సమస్యకు కొద్ది నెలల్లోనే పరిష్కారం లభిస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ భరోసా ఇచ్చారు. ఆదివారం ఏలూరులోని తన కార్యాలయంలో కొల్లేరు ప్రాంత రైతులతో ఎంపీ సమావేశమయ్యారు. తమ సమస్యపై పోరాడుతున్న ఎంపీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కొల్లేరు రైతులతో ఎంపీ పుట్టా మహేష్ మాట్లాడుతూ :
20 వేల ఎకరాలకు పైగా ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని, రైతుల్లో అధికశాతం బీసీ, ఎస్సీ వర్గాలకు చెందినవారేనని, వారికి అన్యాయం జరగకుండా సుప్రీంకోర్టు సాధికార కమిటీ (సీఈసీ)తో పలుమార్లు చర్చించినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధిని కాపాడేలా కాంటూరు కుదింపు సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టులో రైతులకు అనుకూల తీర్పు వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కొల్లేటికోటకు చెందిన భలే యేసురాజు నేతృత్వంలో రైతులు ఎంపీని ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

