🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట
రెండు డీఏలు.. 12వ వేతన సవరణ సంఘం.. సరెండర్ లీవ్‌పై నిర్ణయాలతో హర్షం
చంద్రబాబు నిర్ణయాలపై ఉద్యోగుల హర్షాతిరేకం
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో శనివారం ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.
పలు కీలక నిర్ణయాలపై హర్షం :
ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేయడం, 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నియామకానికి చర్యలు తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే సంక్రాంతి సందర్భంగా సరెండర్ లీవ్ మంజూరు చేయడంతో పాటు పోలీసు ఉద్యోగులకు ఈ అక్టోబర్‌లో ఒక సరెండర్ లీవ్ కల్పించనున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10 శాతం, 15 శాతం మేర పెంచే నిర్ణయం తీసుకోవడం ద్వారా వృద్ధ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని నాయకులు పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం ద్వారా వారి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపారని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
‘థాంక్యూ సీఎం సార్’ నినాదాలు :
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు, మహిళా ఉద్యోగులు, ఎన్జీవోలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘థాంక్యూ సీఎం సార్.. థాంక్యూ సాగర్ సర్’ అంటూ నినాదాలతో ఫైర్‌స్టేషన్ సెంటర్‌ను హోరెత్తించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ పూర్తి సహకారం ఉంటుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జేఏసీ రాష్ట్ర నాయకుడు ఆర్.ఎస్. హరనాధ్, జేఏసీ జిల్లా కన్వీనర్ తాళ్లూరి రామారావు, ఎన్జీవో సంఘ కార్యదర్శి నెరుసు రామారావు, జిల్లా జేఏసీ నాయకులు రుద్రాక్షి రవికుమార్, జి. మోహన్, బి. రాము, ఎన్జీవోస్ అసోసియేషన్ ఏలూరు తాలూకా అధ్యక్షుడు జి. శ్రీధర్‌రాజు, కార్యదర్శి జి. చంద్రశేఖర్, మహిళా విభాగం చైర్పర్సన్ కె. సునీత, సత్యభారతి, రజిత, సునీత తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఎన్జీవో సంఘ నాయకులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు హాజరయ్యారు.

