🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ వేగవంతం
ప్రధాన డ్రైన్‌లలో వ్యర్థాల తొలగింపు పనుల పరిశీలన చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి
డ్రైన్‌లలో చెత్త వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి
స్వచ్ఛ ఏలూరే లక్ష్యమని స్పష్టం
రానున్న వర్షాకాలంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. నగరాన్ని స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాన డ్రైన్‌లలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాల తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం 45వ డివిజన్‌లోని జాలిపూడి డ్రైన్‌తో పాటు 7వ డివిజన్ తూర్పువీధి గంగానమ్మ గుడి సమీపంలోని డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
20 రోజులుగా ముమ్మరంగా పనులు :
గత 20 రోజులుగా ప్రధాన కాలువలు, డ్రైన్‌లలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల సమస్యలు, పారిశుద్ధ్య ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ప్రజల సహకారం అవసరం :
డ్రైన్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం వేయడం వల్లే దుర్వాసనలు, పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంటింటికీ వచ్చే చెత్త సేకరణ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని, నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్వచ్ఛ ఏలూరే లక్ష్యం :
నగర ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఏలూరు నిర్మాణమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు.

