గోపాలపురం మండలం రాంపాలెంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ
తూర్పుగోదావరి జిల్లా : గోపాలపురం : ది డెస్క్ :
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వంగవీటి మోహనరంగా విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగానే ఒక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం, రంగా మరణించి 39 సంవత్సరాలు గడిచినా ఆయన పేరు వింటే ప్రత్యర్థుల్లో ఇప్పటికీ భయం తగ్గలేదనే విషయాన్ని చాటుతోందని ఆంధ్ర-తెలంగాణ రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాంపాలెంలో మంగళవారం నిర్వహించిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కొవ్వూరుపాడు నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన రంగా అభిమానులు రాంపాలెం చేరుకుని ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వంగవీటి శాంతన్ కుమార్, కరాటం రాంబాబు ల చేతుల మీదుగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ పెద్ద ఎత్తున ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 174 విగ్రహాలను అందించానని.. వంగవీటి మరో విగ్రహాన్ని అందించడం సంతోషాన్నిచ్చిందన్నారు. అదేవిధంగా బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో ప్రజల కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా అని పేర్కొన్నారు. రిక్షా కార్మికుల నుంచి కొబ్బరి బోండాలు అమ్ముకునే చిన్న వ్యాపారులను సైతం కార్పొరేటర్‌గా చేసిన ఘనత ఒక్క వంగవీటికే దక్కుతుందని అన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ హోంమంత్రి తానేటి వనిత రాష్ట్రవ్యాప్తంగా 175 రంగా విగ్రహాలను విరాళంగా అందించిన కాళ్లపాలెం బుజ్జి సేవలను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రంగా అభిమానులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

