🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భక్తుల సౌకర్యార్థం కియోస్క్ మిషన్లు
ఆన్‌లైన్ సేవలు ఇక మరింత సులభం
మావుళ్లమ్మ ఆలయంలో ఆధునిక సౌకర్యం
భీమవరం పట్టణంలోని మావుళ్లమ్మవారి దేవస్థానంలో భక్తులకు మరింత సులభతరంగా సేవలు అందించేందుకు కియోస్క్ ఆన్‌లైన్ మిషన్లను ఏర్పాటు చేశారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు కరూర్ వైశ్య బ్యాంకు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కియోస్క్ మిషన్లను స్థానిక శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు.
ఆలయానికి వచ్చే భక్తులు వివిధ సేవలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా సులభంగా పొందేందుకు ఈ కియోస్క్ మిషన్లు ఉపయోగపడనున్నాయి. ఆలయ సేవలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ :
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ సేవలను సాంకేతికతతో అనుసంధానం చేయడం అభినందనీయమన్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా దేవస్థానంలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గొంతెన రమణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

