🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్లమ్మ దేవస్థానంలో కళాకారులు, యోగా నిపుణులకు సత్కారం
అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరంలోని మావుళ్లమ్మవారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన సంగీత కళాకారులతో పాటు దేవస్థానానికి సేవలందిస్తున్న సన్నాయి, డోలు, తాళం విద్వాంసులను ఘనంగా సత్కరించారు.
విజ్ఞాన సమితి అధ్యక్షులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని కళాకారులకు శేషవస్త్రాలు, జ్ఞాపికలు, ప్రసాదాలు అందజేసి వారి సేవలను కొనియాడారు.
అనంతరం యోగ రంగంలో విశేష సేవలందిస్తున్న యోగా నిపుణులు, సుదర్శన క్రియ శిక్షకులు కలిగొట్ల గోపాల శర్మను, యోగా శిక్షణ కార్యక్రమాలకు సహకరించిన దేవస్థానం ధర్మకర్త పాపొలు ఏడుకొండలును ప్రత్యేకంగా సన్మానించారు.
యోగ శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని, సంగీతం మనసుకు ప్రశాంతతను అందిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో యోగం మరియు సంగీతం కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిషి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి, గొంతెన రమణ, అరసవిల్లి సుబ్రహ్మణ్యం, యండా సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

