The Desk …Kaikaluru : ఆచవరం గ్రామంలో కైకలూరు పట్టణ పోలీసుల అవగాహన సదస్సు.. సైబర్ నేరాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాలపై ప్రజలకు సూచనలు

The Desk …Kaikaluru : ఆచవరం గ్రామంలో కైకలూరు పట్టణ పోలీసుల అవగాహన సదస్సు.. సైబర్ నేరాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాలపై ప్రజలకు సూచనలు

🔴 ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు కైకలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ పర్యవేక్షణలో ఎస్ఐ వెంకట కుమార్ ఆధ్వర్యంలో ఆచవరం గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన చట్టాలు, డయల్ 112 సేవలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, బాల్య వివాహాల దుష్పరిణామాలపై గ్రామస్తులకు వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట కుమార్ మాట్లాడుతూ.. బాల బాలికల భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. లైంగిక వేధింపులు, అనుమానాస్పద సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పెరుగుతున్న మోసాలు, ఫేక్ అకౌంట్లు, అపరిచిత వ్యక్తుల వేధింపుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు ఇతరులతో పంచుకోవడం వల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా బాల్య వివాహాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, చట్టపరంగా అవి నేరమని వివరించారు. అలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు. సమాజ భద్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, సోషల్ మీడియాను సానుకూల దిశగా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.