The Desk … Mudinepalli : మహిళ, బాలిక అదృశ్యం.. కేసు నమోదు

The Desk … Mudinepalli : మహిళ, బాలిక అదృశ్యం.. కేసు నమోదు

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ, బాలిక అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 93/2026 కింద మహిళ, బాలిక మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మండలంలోని పెదపాలపర్రు గ్రామానికి చెందిన చిట్టెం చౌదరి ఫిర్యాదు మేరకు, అతని భార్య చిట్టెం నాగరాణి (27), కుమార్తె చిట్టెం యస్విక (5) కనిపించకుండా పోయినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, చౌదరి తమ్ముడి వివాహం మే 9, 2026న జరగనుండటంతో, మినుములు అమ్మిన రూ.50 వేల నగదును మే 7న భార్యకు ఇచ్చి తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకుని కొత్త బట్టలు తీసుకురావాలని చెప్పినట్లు తెలిపారు. దీంతో నాగరాణి మధ్యాహ్నం సమయంలో గుడివాడకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరినట్లు పేర్కొన్నారు.

సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా భార్య, కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అనంతరం గుడివాడ వెళ్లి విచారించగా తాకట్టు తన పేరు మీద లేకపోవడంతో బంగారం ఇవ్వలేదని, అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ముదినేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు ఆధారంగా ఎస్‌ఐ వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.