ఆత్మకూరు అభివృద్ధికి మంత్రి ఆనం ఆకస్మిక పరిశీలన
🔴 నెల్లూరు జిల్లా :ఆత్మకూరు : ది డెస్క్ :

ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం ఆకస్మికంగా పలు ప్రాంతాలను పరిశీలించారు. పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో క్రీడా ప్రాంగణం, నగరవనం, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రస్తుతం ఉన్న క్రీడా ప్రాంగణం విస్తరణ కోసం మరో 10 ఎకరాల అదనపు స్థల సేకరణకు సంబంధించి మంత్రి స్థలాన్ని పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అలాగే నగరవనం అభివృద్ధి కోసం నేషనల్ హైవే నుండి అప్రోచ్ రహదారి ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు.
అదేవిధంగా బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తించేందుకు అధికారులతో కలిసి పరిశీలించి, త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ:.
ఆత్మకూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు విద్య, క్రీడలు, పర్యావరణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
మోడల్ రహదారిగా ఆత్మకూరు బైపాస్ రోడ్డు :
ఇప్పటికే ఆత్మకూరు బైపాస్ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మరో ఆరు నెలల్లో ఆత్మకూరుకు అద్భుతమైన రహదారిని అందిస్తామని మంత్రి తెలిపారు. రహదారిని బ్యూటీఫికేషన్, సెంట్రల్ లైటింగ్ వంటి ఆధునిక హంగులతో మోడల్ రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
అనంతరం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

