ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అలవాటుపడిన నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ముదినేపల్లి వద్ద సోమవారం ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితులను గుర్తించారు.
అరెస్ట్ అయిన నిందితులు.. గొల్ల వంశీ (25), గుర్వాయిపాలెం గ్రామం, కలిదిండి మండలం, కాల దేవి వర ప్రసాద్ (26), బాస్కరరావుపేట గ్రామం, కలిదిండి మండలం. వీరు గత సంవత్సరం కాలంగా ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, పెడన, మొగల్తూరు తదితర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లలో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు, తదితర విలువైన వస్తువులను దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు వీరిని అరెస్ట్ చేసి మొత్తం 7 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు (25 కాసులు), 3 కిలోల వెండి వస్తువులు, 3 ఎల్‌ఈడీ టీవీలు, 3 గ్యాస్ సిలిండర్లు, 3 మోటార్ సైకిళ్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.45 లక్షలుగా అంచనా వేశారు.
ఈ కేసు ఛేదనలో కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్, ముదినేపల్లి ఎస్‌ఐ వి.ఎస్.వి. భద్రరావు, కలిదిండి ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది బి. నాగబాబు, పి. నాగరాజు, పి. పవన్ కుమార్, జి. శివ కోటయ్య, పి.వి. సత్యనారాయణ (డీఎస్‌బీ సెల్ ట్రాక్) కీలక పాత్ర పోషించారు.
ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కొమ్ము ప్రతాప్ శివ కిషోర్ అభినందించారు.

