- రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం.
- ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ఏలూరు జిల్లా
- పట్టుబట్టి సాధిస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
- రైతులకు, యువతకు ప్రయోజనంగా మారనున్న ఫుడ్, ఎంఎస్ఎంఈ పార్కులు
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

జిల్లాను పరిశ్రమల కేంద్రంగా, ముఖ్యంగా ఫుడ్ ప్రాససింగ్ హబ్ గా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. మంగళవారం మొర్సపూడి మెగా ఫుడ్ పార్కు సహా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండు పరిశ్రమలకు శంకుస్థాపన, ఒక ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
రైతులకు మేలు చేయడంతో పాటు, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషిచేస్తున్నామన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు కోరుతూ గత ఏడాది ఇదే నవంబర్ లో తాను కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిత ప్రవీణ్ ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ లో ఇదే నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో జీరో పావర్టీ- పీ4 ప్రారంభోత్సవ ప్రజావేదిక కార్యక్రమంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గుర్తు చేశారు.
తాజాగా మంగళవారం నాడు నూజివీడు మండలం మొర్సపూడి గ్రామం వద్ద రమణ్ సింగ్ మెగా ఫుడ్ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయటం సంతోషం కలిగించిందన్నారు. దీనితోపాటు ద్వారకాతిరుమల మండలం సిహెచ్. పోతేపల్లిలో గోద్రెజ్ ఆగ్రో వెట్ పామాయిల్ డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన, చింతలపూడి మండలం పట్టాయగూడెంలో 65 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రారంభోత్సవం చేయడం జిల్లా రైతాంగానికి, యువతకు సంతోషకరమైన సందర్భంగా పేర్కొన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ గణనీయంగా పెరగడమే కాకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి దోహదం చేస్తుందన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వ్యవసాయంపై ఆధారపడి రైతులు జీవనం సాగిస్తున్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటు వలన స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు, మామిడి, కోకో, పామాయిల్, కొబ్బరి, నిమ్మ, కూరగాయలు వంటి పంటలు సాగు చేస్తుండటం వల్ల ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయటం రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు.
వీటి వలన రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగానే విక్రయించుకునే వెసులుబాటు లభించడంతో పాటు గిట్టుబాటు ధర పొందడానికి వీలుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ . అంతేగాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని, తద్వారా గ్రామీణ ప్రాంత యువత వలస వెళ్ళడాన్ని తగ్గిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలు తీసుకురావడంతోపాటు, ఏలూరు జిల్లాను ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మార్చడానికి తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు ఎంపీ.
ఈ సందర్భంగా తన విజ్ఞప్తులు మన్నించి జిల్లాకు పరిశ్రమలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ప్రత్యేకంగా మొర్సపూడి మెగా ఫుడ్ పార్కు రావడానికి కారణమైన యువ నేత నారా లోకేష్ కి, పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన తరపున, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరపున ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

