🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
సెప్టెంబరు 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ
రూ.3.92 కోట్ల విలువైన భూమికి పట్టాలు
పేదల సొంతింటి కలకు పట్టాభిషేకం
పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా నందిగామ పట్టణంలో 45 కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. శుక్రవారం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
జీవో నం.30 ప్రకారం 2019కు ముందు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని, ఇంటి పన్ను రసీదులతో దరఖాస్తు చేసుకున్న వారిలో 45 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. సెప్టెంబరు 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుందని పేర్కొన్నారు. 150 చదరపు గజాల వరకు స్థలాలకు ఉచిత రిజిస్ట్రేషన్, అంతకుమించిన స్థలాలకు ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఉంటుందని వివరించారు.
మొత్తం 3,746.68 చదరపు గజాల స్థలానికి మార్కెట్ విలువ సుమారు రూ.3.92 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులకు డిసెంబరు 31, 2026 వరకు అవకాశం ఉందని, నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

