The Desk… Vijayawada : ▪️”జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్”▪️

The Desk… Vijayawada : ▪️”జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్”▪️

🔴 విజయవాడ : ది డెస్క్ :

ప్రెస్‌ స్వేచ్ఛపై దాడి జరిగితే సహించేది లేదు

జర్నలిస్టుల భద్రతే మా ప్రధాన లక్ష్యం
➖JPF

ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలుస్తూ.. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల రక్షణ కోసం “జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్” ఏర్పాటు కావడం కీలక పరిణామంగా నిలుస్తోంది. జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు, వేధింపులు చోటుచేసుకున్నప్పుడు వారికి అండగా నిలవడంతో పాటు, వారి హక్కులు మరియు ప్రెస్‌ స్వేచ్ఛను కాపాడేందుకు ఈ వేదిక పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.

“జర్నలిస్టు భద్రతే.. ప్రజాస్వామ్య బలం” అనే నినాదంతో జర్నలిస్టులంతా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని ఫోర్స్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారైనా, రాజకీయ నాయకులైనా, ప్రభావవంతమైన వ్యక్తులైనా.. నిజాన్ని రాసే జర్నలిస్టుపై ఒత్తిడి తీసుకురావడం, బెదిరించడం లేదా దాడి చేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించకూడదనే బలమైన సందేశాన్ని ఈ వేదిక ఇస్తోంది.

నిజాన్ని రాసే కలానికి రక్షణ అవసరం :

సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. అయితే అదే సమయంలో విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.

జర్నలిస్టు గొంతును అణచివేయడం అంటే ప్రజల గొంతును అణచివేయడమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పలువురు జర్నలిస్టులు తమ అభిప్రాయం తెలియజేశారు.

ఐక్యతే జర్నలిస్టుల బలం :

వృత్తిపరంగా జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి పరస్పరం అండగా నిలవడం, అత్యవసర పరిస్థితుల్లో సహకరించడం, జర్నలిస్టుల హక్కుల కోసం చట్టపరంగా పోరాడడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఒక్క జర్నలిస్టుపై దాడి జరిగితే.. అది మొత్తం జర్నలిస్టు సమాజంపై దాడిగా భావిస్తాం” అనే స్థాయిలో ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పలువురు పేర్కొంటున్నారు.

ప్రెస్ ఫ్రీడమ్‌కు పటిష్టమైన కవచం :

జర్నలిస్టుల భద్రత, ప్రెస్‌ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్.. జర్నలిస్టుల హక్కుల కోసం ఒక బలమైన వేదికగా ఎదగాలని ఆశాభావం వ్యక్తమవుతోంది.

నిజం కోసం నిలిచే కలానికి భయం ఉండకూడదు

ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టుకు రక్షణ ఉండాలి

ప్రెస్‌ స్వేచ్ఛను కాపాడటం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత

జర్నలిస్టుల హక్కులు – మా హక్కులు

జర్నలిస్టుల రక్షణ – మా బాధ్యత

ప్రెస్‌ స్వేచ్ఛ – ప్రజాస్వామ్యానికి ఊపిరి!