🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ఉపాధ్యాయులు దైవంతో సమానం

విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలో నడిపించే ఉపాధ్యాయులు దైవంతో సమానమని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏలూరులోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా 33 మంది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్వి మాట్లాడుతూ :
ఉపాధ్యాయులు విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో ధైర్యం, సహనం, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఏలూరు జిల్లాలో బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, పదో తరగతి ఫలితాల మెరుగుదలకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ :
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులను సరైన మార్గంలో నడిపించేది గురువులేనని, గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

