🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
శాంతి, మానవత్వమే ప్రవక్త బోధన
ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
మత సామరస్యానికి ప్రతీకగా మిలాద్ వేడుకలు
ప్రవక్త బోధనలు అందరికీ ఆదర్శం
➖ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ పట్టణంలోని 6వ వార్డు జండా చెట్టు ప్రాంతంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, మత పెద్దల సందేశాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ :
మహ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, సమానత్వం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. సమాజంలో మత సామరస్యం, పరస్పర గౌరవం, ఐక్యత మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భోజనాన్ని వడ్డించారు. అనంతరం నిర్వాహకులు, మత పెద్దలు, స్థానికులతో కలిసి కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. పండుగను పురస్కరించుకుని భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ప్రవక్త మహ్మద్ చూపిన సన్మార్గాన్ని అనుసరిస్తూ శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి మెలిసి జీవించేలా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వార్డు నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా జండా చెట్టు ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

